ఆంధ్రా అసోసియేషన్ వైభవం
సేవే పరమావధిగా.. తెలుగు వారి శ్రేయస్సే లక్ష్యంగా.. ఎందరో మహానుభావుల కృషితో 1935లో పురుడు పోసుకుంది ఆంధ్రా అసోసియేషన్. ఆనాటి నుంచి నేటివరకు మన ఆత్మీయ సంస్థ ఆంధ్రా అసోసియేషన్ ఎలాంటి తారతమ్యాలు లేకుండా, రాగద్వేషాలకు తావివ్వకుండా అందరి ఆదరాభిమానాలతో 85వ వసంతంవైపు దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. 1935లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, వరాహగిరి వెంకటగిరి, మాడభూషి అనంతశయనం అయ్యంగార్, ఆచార్య ఎన్.జి. రంగా ఇంకా ఎందరో మహనీయుల కృషితో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రా అసోసియేషన్ ఏర్పడింది. ఈ అసోసియేషన్ స్థల సేకరణకు, అతి సుందరమైన, దివ్యమైన భవన నిర్మాణానికి వ్యవస్థాపకులతోపాటు శ్రీమతి కొత్త లక్ష్మీ రఘరామయ్య, శ్రీ కొత్త రఘరామయ్య, శ్రీ ఎస్.వి.ఎన్. మూర్తి, శ్రీ గోగినేని కృష్ణారావు సేవలు చిరస్మరణీయం. వీరందరి నిర్విరామ కృషితో ఆంధ్రా అసోసియేషన్.. సొసైటీస్ యాక్ట్ కింద 1945లో రిజిస్టర్ అయింది. వారి పట్టుదల, కృషి, విశేష సేవలు ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.

ఆ మహానుభావులందరి సేవలను స్మరించుకుంటూ.. వారి బాటలో కొనసాగుతూ ఆంధ్రా అసోసియేషన్ నిరంతరం సమాజసేవలో నిమగ్నమై పలు రంగాల్లో విశేష సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. సాంఘీక, సంక్షేమ, సాహిత్య, సాంస్కృతిక, విద్య, వైద్య రంగాల్లో విశేష సేవలను అందిస్తూ.. ఢిల్లీలోని తెలుగు వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటోంది. తెలుగు భాష, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం అహర్నిశలూ పాటుపడుతోంది. ఈ విధంగా తెలుగు జాతికి విశేష సేవలు అందిస్తూ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తూ 86వ వసంతం వైపు పయనిస్తోంది మన ఆత్మీయ సంస్థ ఆంధ్రా అసోసియేషన్.

ప్రముఖులకు సత్కారం..

  • ఆంధ్రా అసోసియేషన్ ఏర్పడిన నాటినుంచి నేటివరకు ఆయా రంగాలలో విశేష, నిరుపమానమైన సేవలందించిన అనేక మంది ప్రముఖులను, మేథావులను సన్మానిస్తూ వస్తోంది. ఆ సత్కారం స్వీకరించిన ప్రముఖులు..
  • 1952లో నాటి ఉపరాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌‌కు సత్కారం.
  • 1960లో అసోసియేషన్ రజతోత్సవ వేడుకల్లో నాటి రాష్ట్రపతి డా. బాబు రాజేంద్రప్రసాద్‌‌కు సన్మానం.
  • 1987లో ఆంధ్రా అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆనాటి భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావును ఘనంగా సన్మానించారు.
  • అత్యంత ప్రతిష్టాత్మకంగా పున:నిర్మించిన కొత్త రఘురామయ్య గోదావరి ఆడిటోరియంను భారత ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.

విద్యార్థులకు ఉపకార వేతనాలు.. ప్రతీ సంవత్సరం తెలుగు విద్యార్థినీ, విద్యార్థులకు ఆంధ్రా అసోసియేషన్ సుమారు 30 లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందిస్తోంది. దీంతోపాటు ప్రతిభ గల విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి వారికి కూడా ఈ స్కాలర్‌షిప్‌లు అందించి చేదోడువాదోడుగా నిలుస్తోంది.

క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.. తెలుగు వారి శారీరక, మానసికోల్లాసం కోసం మన ఆంధ్రా అసోసియేషన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం మహిళలు, పురుషులకు, చిన్నారులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులను అందిస్తోంది.

ఆంధ్రా అసోసియేషన్ హెల్త్ డైగ్నోస్టిక్ సెంటరు అనుభవము, నైపుణ్యము కలిగిన వైద్యులతోను, ఆధునిక వైద్య పరికరాల తోనూ ఢిల్లీ లోని తెలుగు వారికి సేవలు అందిస్తుంది.

ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా నివసిస్తున్న ప్రదేశాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేస్తోంది.

ఆర్ధికంగా వెనుకబడిన తెలుగు వారికి వైద్యం అందించడం కోసం షాద్రా లో వైద్య శాఖను అసోసియేషన్ నడుపుతున్నది.

ఆడబిడ్డల వివాహానికి చేయూత.. పేద తెలుగు కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహ ఖర్చులకు అసోసియేషన్ తరపున కొంత ఆర్థిక చేయూతను అందించి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటోంది.

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం.. పేద తెలుగు కుటుంబాల్లో దురదృష్టవశాత్తూ ఎవరైన మరణించినట్లయితే.. వారి దహనసంస్కారాలు నిర్వహించేందుకు మన ఆత్మీయ సంస్థ ఆర్థికంగా బాసటగా నిలుస్తోంది.

'

మత సామరస్యాలకు అతీతంగా.. మన ఆత్మీయ ఆంధ్రా అసోసియేషన్ మతాలకు అతీతంగా అన్ని పండుగలను స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడమే లక్ష్యంగా ప్రతీ సంవత్సరం శ్రీ రామనవమి, సంక్రాంతి, మహా శివరాత్రి, ఉగాది, వినాయక చవితి, దీపావళితోపాటు క్రిస్మస్, ఈస్టర్, రంజాన్.. మొదలగు పండుగల వేడుకలను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పర్వదినాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అసోసియేషన్ లౌకికతత్వాన్ని చాటుతూ అందరి ఆదరాభిమానాలను అందుకుంటోంది.

వైద్య సహాయం.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేద తెలుగు వారికి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించి, వారికి మెరుగైన వైద్యం అందేలా మన ఆంధ్రా అసోసియేషన్ కృషి చేస్తోంది.