భవనం ఆకాశ హర్మ్యం… ఆడిటోరియం శోభాయమానం

దేశరాజధాని ఢిల్లీ నడిబొడ్డున తెలుగు వారందరూ గర్వించే విధంగా రూపుదిద్దుకుంది ఆంధ్రా అసోసియేషన్ భవనం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి అత్యంత శోభాయమానంగా భవనాన్ని నిర్మించడం జరిగింది.ఈ ఆకాశ హర్మ్యం లోథి రోడ్డు ప్రాంతానికి వచ్చిపోయే వారిని ఎంతగానో ఆకర్షిస్తోంది.ఇది ఒక విశేషమైతే భవనం లోపల అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన ఆడిటోరియం మరో విశిష్టత. ఇక్కడకు వచ్చే సందర్శకులు, ఆహుతులను ఆడిటోరియం లోపల ఉన్న ప్రపంచస్థాయి హంగులు కనువిందు చేస్తున్నాయి. దేశవిదేశాలనుంచి ఎంపిక చేసి తీసుకొచ్చిన అత్యాధునిక సాంకేతిక ఉపకరణాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదుటనున్న ఫౌంటైన్ ఆహ్లాదపరుస్తోంది. ఆడిటోరియం ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉన్న గజరాజ ప్రతిమలు, ప్రాచీన దీప కాంతులు అతిరథ మహారథులను స్వాగతిస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆడిటోరియంలోకి అడుగు పెట్టగానే రంగురంగుల విద్యుత్ దీపకాంతులు మిరుమిట్లు గొలుపుతూ చూపరులను కనువిందు చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని ఇంటీరియర్ డిజైన్స్, సౌండ్ సిస్టమ్, ఒకేసారి 100 మందికి పైగా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేయడానికి అనువుగా రూపొందించిన అతిపెద్ద వేదిక చూపరులను అలరిస్తోంది.ఈ కళాప్రదర్శనలను 400 మంది ప్రేక్షకులు తిలకించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇలా ఎన్నో సౌకర్యాలతో నిర్మించిన ఈ ఆడిటోరియం విచ్చేసినవారందరికీ అహ్లాదాన్ని పంచుతూ విరాజిల్లుతోంది.