ఆంధ్రా అసోసియేషన్ మార్గ్
ఆంధ్రా అసోసియేషన్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక చారిత్రాత్మక ఘట్టం “ఆంధ్రా అసోసియేషన్ మార్గ్” నామకరణం. ఆంధ్రా అసోసియేషన్ భవనం ఉన్న ప్రాంతంలోని రహదారికి “ఆంధ్రా అసోసియేషన్ మార్గ్” అని పేరు పెట్టాలని కార్యవర్గం కొన్ని సంవత్సరాలనుంచి కేంద్ర ప్రభుత్వం, స్థానిక కార్పోరేషన్, దానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదిస్తూ వచ్చింది. ముఖ్యంగా ప్రస్తుత కార్యవర్గం (2014-2018) చేసిన కృషి ఫలితంగా చివరకు ఇది కార్యరూపం దాల్చింది. ఆ విధంగా లోథి రోడ్డు ప్రాంతంలోని వర్థమాన్ మార్గ్, భీష్మ పితామహ మార్గ్ లను కలిపే రోడ్డును “ ఆంధ్రా అసోసియేషన్ మార్గ్” గా నామకరణం చేయడం జరిగింది. ఎంతో కృషి పట్టుదలతో సాధించిన ఈ రోడ్డు నామకరణాన్ని 22-04-2018 న మంగళ వాయిద్యాలతో తెలుగు ప్రజల సమక్షంలో దక్షిణ ఢిల్లీ మేయర్ శ్రీమతి కమల్ జీత్ సెహరావత్ ప్రారంభించారు. ఆమెతో పాటు ఈ మహోత్సవంలో స్థానిక కౌన్సిలర్ శ్రీమతి సీమామాలిక్ గౌరవ అతిథిగా హాజరై తెలుగు ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియ జేశారు. దేశరాజధాని ఢిల్లీ లో మొట్టమొదటి సారిగా ఓ రోడ్డుకు ఆంధ్రా అసోసియేషన్ మార్గ్ గా నామకరణం చేయడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఈ ఘనత అహర్నిశలు కృషిచేసిన ప్రస్తుత కార్యవర్గానికే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకార మహోత్సవం
ఆంధ్రా అసోసియేషన్ కేంద్ర కమిటీ, బ్రాంచి కమిటీలకు ఎన్నికలు 18-11-2018 న ప్రశాంతంగా జరిగాయి.ఎంతో ఉత్కంఠతో జరిగిన ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అభ్యర్థులందరినీ ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు అభినందించారు. అనంతరం నవంబర్ 25న ఆంధ్రా అసోసియేషన్ లోని గోదావరి ఆడిటోరియంలో గెలుపొందిన 96 మంది అభ్యర్థులు ఢిల్లీ లోని తెలుగు ప్రజల సాక్షిగా తమ పదవీకాలం అంతా ఢిల్లీ లోని తెలుగువారి సంక్షేమానికి పాటుపడతామని ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎంతో మంది తెలుగు ప్రజలు, పుర ప్రముఖులు హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు.

ప్లాటినం జూబ్లీ వేడుకలు
ఆంధ్రా అసోసియేషన్ ప్లాటినం జూబ్లీ వేడుకలు 2019 జనవరి 27న కన్నులపండువగా జరిగాయి.ఈ వేడుకల సందర్భంగా అసోసియేషన్ భవనంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన కొత్త రఘురామయ్య గోదావరి ఆడిటోరియంను భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.ఈ వేడుకల్లో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మణినాయుడు స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసిన అలనాటి ఎందరో ప్రముఖులను స్మరించుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ ఆడిటోరియంను

భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. అనంతరం ఈ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన విజిలెన్స్ కమీషనర్ శ్రీకె.వి. చౌదరి ప్రసంగిస్తూ… అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. అనంతరం ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దాదాపు 40 నిమిషాలపాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాతృభాష ప్రాముఖ్యత, ప్రపంచంలో తెలుగువారు సాధించిన విజయాల గురించి తెలియజేశారు. ఆంధ్రా అసోసియేషన్ నిర్వహిస్తున్న సాంస్కృతిక, సేవా, విద్య, వైద్య కార్యక్రమాలను అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకల వందన సమర్పణలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ కోటగిరి సత్యనారాయణ మాట్లాడుతూ… ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ ఆడిటోరియాన్ని ప్రారంభించాలనే సంకల్పంతో 5 నెలలు నిరీక్షించామని పేర్కొన్నారు. చివరకు తమ ఆహ్వాన్నాన్ని మన్నించి ఈ వేడుకకు విచ్చేసిన ఉపరాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేశారు.

వైభవంగా వినాయక చవితి వేడుకలు……… ఢిల్లీ ముఖ్యమంత్రికి సత్కారం
ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో 2019 సెప్టెంబరులో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వినాయక చవితి ప్రారంభ వేడుకలకు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా , గౌరవ అతిథులుగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి డా. నారాయణరాజు, కేంద్ర మాజీ సమాచార కమీషనర్ శ్రీమాడభూషి శ్రీధరాచార్యులు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ సలహాదారు శ్రీ కె.జె .రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు ఆంధ్రా అసోసియేషన్ సేవలను, కార్యక్రమాలను ప్రశంసించారు. అనంతరం ముఖ్య అతిథులను ఆంధ్రా అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.ఏడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలను రోజుకొక బ్రాంచి వారి ఆధ్వర్యంలో నిర్వహించేటట్లుగా పాలకవర్గం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ఆయా బ్రాంచ్ లకు చెందిన కళాకారులు ప్రతిరోజూ నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. వినాయక చవితి ఉత్సవాల చివరి రోజున (8-9-2019) వివిధ బ్రాంచ్ ల నుంచి భక్తులు ఆంధ్రా అసోసియేషన్ భవనానికి బొజ్జ గణపయ్య విగ్రహాలతో తరలి వచ్చారు. అక్కడి నుంచి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు బొజ్జ గణపయ్య విగ్రహాలను భక్తిశ్రద్ధలతో యమునా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని అన్ని బ్రాంచీల భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.

ఘనంగా గురు పూజోత్సవం---ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
డా: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని 2019 సెప్టెంబర్ 5 వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆంధ్రా అసోసియేషన్, తేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. సమాజ శ్రేయస్సుకు తమ విద్యాబోధన ద్వారా అవిరళ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను సముచితంగా సత్కరించాలనే సదుద్దేశంతో ఈ సారి అసోసియేషన్ ఈ వేడుకలను నిర్వహించేమ్దుకు నిశ్చయించింది. దానిలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ భవనంలోని సమావేశమందిరంలో జరిగిన గురుపూజోత్సవ వేడుకలకు కేంద్ర హోశాఖ సహాయమంత్రి శ్రీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉర్వి స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపకులు శ్రీ యుఎన్.బి.రావు గౌరవ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను, సేవలను శ్రీ కిషన్ రెడ్డి ప్రశంసించారు. అనంతరం విద్యా బోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి కిషన్ రెడ్డి, యు.ఎన్.బి.రావు “ఉత్తమ ఉపాధ్యాయ” అవార్డులతో పాటు జ్ఞాపికలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో రాజధాని నలుమూలల నుంచి తెలుగు ఉపాధ్యాయులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.